Wednesday, April 7, 2021

జ్యోతిష్యం వలన నష్టాలు

జ్యోతిష్యం వలన నష్టాలు

అమిరపు నటరాజన్, బాపట్ల. 


మనిషిలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి శరీరం, రెండవది మనస్సు. శరీరం బయటికి కనిపించేదయితే, మనస్సు చాలా సూక్ష్మంగా, సున్నితంగా ఉండి బయటకు తానుగా కనిపించదు. అయితే మనస్సు చేసే పనులను మనం శరీరం చేసే పనుల ద్వారా తెలుసుకుంటాము. మనస్సు చేసే పనులంటే ఆలోచనలే కదా. ఈ ఆలోచనలు చాలా శక్తిమంతమైనవి. ఏకంగా ప్రపంచాన్నే నాశనం చేయగల శక్తి కూడా వాటికి ఉంటుంది, ప్రపంచానికి మేలు చేయగలశక్తి కూడా వాటికి ఉంటుంది. అయితే ప్రతి మనిషీ అలాంటి శక్తిని చూపలేడు. ఎవరైతే తన ఆలోచనలను తన స్వాధీనంలోనే ఉంచుకోవడం నేర్చుకున్నాడో అటువంటి వాడే వాటిని శక్తిమంతంగా ప్రయోగించగలుగుతాడు. 


మనిషికి చుట్టూ ఉన్న పరిసరాలు మనిషి మీద తప్పక ప్రభావాన్ని చూపగలవు. మనిషి చుట్టూ ఉన్న మనుష్యులు అతడి మీద మరింత ప్రభావాన్ని చూపగలరు. ఆ మనుష్యులలో ఎవరైనా తమ మనస్సుల మీద అదుపు సాధించిన వారు ఉంటే వారు అతడి మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతారు. అటువంటి వారు ఉత్తములైన మనుష్యులై, అటువంటి వారినుంచి మన నేర్చుకోవాలని ప్రయత్నిస్తే, దానివల్ల మనకు ఎంతైనా మేలు జరుగుతుంది. అయితే వారినుంచి మనం మౌలికంగా నేర్చుకునేదేమిటి? మనస్సును అదుపుచేయడమే. 


మనస్సును అదుపుచేయడంలో మనం నేర్చుకునేదేమిటి? మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాలూ, సమస్యలూ ఎప్పటికీ పూర్తిగా మాయమయిపోవు, ఏదోవొక రూపంలో అవి వస్తూనే ఉంటాయన్నదే మనం నేర్చుకుంటాము. అవి ఎప్పటికీ అంతం కావు కాబట్టి వాటిని మనం అదుపుచేయలేమనీ, దానికి బదులు వాటికి మన మనస్సు ప్రతిస్పందించి, ఆ ప్రతిస్పందనలో మనకు బాధ కలిగిస్తోందనీ, కాబట్టి పరిస్థితులవల్ల కాక మన మనస్సు యొక్క ప్రతిస్పందనలవల్లే మనకు బాధలు కలుగుతున్నాయని మనం నేర్చుకుంటాము.  అంతేకాక, మనస్సులో కలిగే ఆలోచనలను మనం అదుపుచేయగలిగితే, మనస్సును మన మాట వినేలాగా చేయగలిగితే, అసలు బాధలనేవే లేని స్థితికి మనం చేరుకోవచ్చని నేర్చుకుంటాము. 


దీనినిబట్టి మనకు అర్థమయ్యేదేమంటే, యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతామన్నదే. ప్రపంచంలో మిగిలిన వస్తువులకన్నా, మనుష్యుల కన్నా అన్నిటికన్నా మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించేది మన మనస్సే. 


మన దేశంలో జ్యోతిష్యశాస్త్రం అనే శాస్త్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. దీని సహాయంలో మనిషి యొక్క పూర్వాపరాలను చెప్పవచ్చునని జ్యోతిష్యులు చెపుతారు. గ్రహాలూ, నక్షత్రాలూ మనిషి మీద, అతడి జీవితం మీద, అతడి సుఖసంపదలమీద, అతడి దుఃఖదురదృష్టాల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయనీ, అతడి జీవితాన్ని తల్లక్రిందులు చేయగలవనీ, కాబట్టి వాటికి విరుగుడుగా ఫలానాఫలానా పనులు చెయ్యాలనీ జ్యోతిష్యులు చెపుతారు. వాస్తుశాస్త్రంలో కూడా ఇటువంటి పోకడలే ఉన్నాయి. వీటికి తోడు, పేరు పెట్టుకోవడం గురించీ, అంకెల గురించీ రకరకాల మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి. సోషల్ మీడియాతో వచ్చిన ఆధునికత ఆ మూఢనమ్మకాలను పోగొట్టడం అటుంచి వాటిని పెంచిపోషిస్తున్నట్టుగా తోస్తుంది. ఈ రోజుల్లో చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ ఈ శాస్త్రాలవెంట పడుతున్నారు. 


ఈ సందర్భంలో, వివేకానంద స్వామి జ్యోతిష్యశాస్త్రాన్ని గురించి చెప్పిన మాటలు మనం వినడం ఎంతైనా అవసరం. 


I have seen some astrologers who predicted wonderful things; but I have no reason to believe they predicted them only from the stars, or anything of the sort. In many cases it is simply mind-reading. Sometimes wonderful predictions are made, but in many cases it is arrant trash…. Excessive attention to the minutiae of astrology is one of the superstitions which has hurt the Hindus very much.

If you want your nation to live, keep away from all these things. The only test of good things is that they make us strong. Good is life, evil is death. These superstitious ideas are springing like mushrooms in your country. Money is the only God of many beings. Weak men, when they lose everything and feel themselves weak, try all sorts of uncanny methods of making money, and come to astrology and all these things. "It is the coward and the fool who says, 'This is fate'" — so says the Sanskrit proverb. But it is the strong man who stands up and says, "I will make my fate." It is people who are getting old who talk of fate. Young men generally do not come to astrology. We may be under planetary influence, but it should not matter much to us. Buddha says, "Those that get a living by calculation of the stars by such art and other lying tricks are to be avoided"; and he ought to know, because he was the greatest Hindu ever born. Let stars come, what harm is there? If a star disturbs my life, it would not be worth a cent. You will find that astrology and all these mystical things are generally signs of a weak mind; therefore as soon as they are becoming prominent in our minds, we should see a physician, take good food and rest.(The Complete Works of Swami Vivekananda/Volume 8/Notes Of Class Talks And Lectures/Man The Maker Of His Destiny) 


వివేకానంద స్వామి ఇలా చెప్పారు.


“కొందరు జ్యోతిష్యులు అద్భుతంగా భవిష్యత్తును చెప్పడం నేను చూశాను. కానీ వారు దానిని కేవలం నక్షత్రాలను బట్టి, లేదా మరేదో కిటుకు ఉపయోగించి మాత్రమే చెప్పగలిగారని నేను అనుకోను. సాధారణంగా ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారో, వారి మనస్సును చదవడం ద్వారా విషయాలను ఊహించి జ్యోతిష్కుడు చెపుతాడు. జ్యోతిష్కులు కొన్నిసార్లు అలా అద్భుతమైన విషయాలను చెప్పగలరేమో కానీ, వారు చెప్పే విషయాలలో ఎక్కువ శాతం పరమచెత్త. జ్యోతిష్యంలోని అల్పాతి అల్ప విషయాలను అతిగా పట్టించుకునే మూఢత్వం వల్లనే హిందువులు ఎక్కువ దెబ్బతిన్నారు. “


“మీ దేశం నాలుగుకాలాల పాటు మనగలగాలంటే ఈ అంధవిశ్వాసాల నుంచి దూరంగా ఉండండి. ఏవైతే మనకు శారీరకంగా, మానసికంగా బలాన్ని ఇస్తాయో అవే మంచివి. మంచి అనేదే జీవితం, చెడు అనేది మరణం. ఈ అంధవిశ్వాసాలు మన దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. చాలామంది మనుష్యులకు కేవలం డబ్బే దైవం. జీవితంలో అన్నీ పోగొట్టుకున్న బలహీనులు - ‘కష్టపడడం మనవల్ల కాదులే’ అన్న బలహీనతతో - ఏదోవొకటి చేసి డబ్బు సంపాదించాలని, నానారకాల మాయామంత్రాలనూ ఆశ్రయిస్తారు. ఈ జ్యోతిష్యంలాంటి వాటన్నింటినీ నమ్మడం మొదలు పెడతారు. సంస్కృతంలో సామెత చెప్పినట్టు, “మందమతులూ, పిరికిపందలూ మాత్రమే ఇది నా తలరాత” అంటారు. అయితే ఒక బలమైన మనిషి, లేచి నిలబడి, ‘నా విధిని నేనే నిర్మించుకుంటాను’ అంటాడు. వయస్సు పైబడుతున్నవారే సాధారణంగా జ్యోతిష్యం గురించి మాట్లాడతారు. యువకులు సాధారణంగా దాని జోలికి పోరు. మన మీద గ్రహాలకు కొంత ప్రభావం ఉండవచ్చు గాక, కానీ దానిని పట్టించుకోవలసిన అవసరం లేదు. ‘నక్షత్రాల స్థితిగతులను లెక్కలు కట్టడం ద్వారానో, ఇంకా అటువంటి వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించా లనుకునేవారిని దగ్గరకు రానీయకండి’ అని బుద్ధుడు చెప్పాడు కదా. భూమి మీద పుట్టిన హిందువులలో ఆయనే గొప్పవాడు కాబట్టి ఆయనకు తప్పక తెలిసి వుండాలి! ఎన్ని నక్షత్రాలయినా రానీ, అవి నన్ను ఏమి చేయగలవు? ఒక నక్షత్రం నా జీవితాన్నే తారుమారు చేసేస్తే అటువంటి జీవితం పైసా విలువ చెయ్యదు. జ్యోతిష్యం మొదలైన మాయతో కూడిన విషయాలన్నీ సాధారణంగా బలహీనమైన మనస్సు ఉండేవారికే నచ్చుతాయి. కాబట్టి మన మనస్సులలో అటువంటి ఆలోచనలు ఎక్కువవుతూ ఉంటే వైద్యుడి సలహా తీసుకుని, బలం పుంజుకునేందుకు మంచి ఆహారం, విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.” 


స్వామీజీ ఇచ్చిన ఈ శక్తిదాయకమైన సందేశాన్ని మనం సరిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. “విశ్వాసం, విశ్వాసం, రగిలే విశ్వాసం, మీమీద మీకు విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం. ఇదే గొప్పతనానికి మార్గం!” అని స్వామీజీ ఘంటాపథంగా మనకు చెప్పారు కదా. మొదటగా మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఆ తర్వాత నమ్మవలసినది సర్వేశ్వరుడైన దేవుణ్ణి. అంతేకానీ భౌతికమైన విషయాలను కాదు. భగవంతుడికి ప్రార్థన చేయండి. దాని ద్వారా మీ మనస్సే చక్కగా భగవంతుడి లక్షణాలను, ఆయన యొక్క అనంతమైన శక్తిని అలవరచుకుంటుంది. ఈ రెండింటి వల్ల మీకు జరిగే మేలును ప్రపంచంలో మరేదీ కలిగించలేదు. 


ఏవో గ్రహాలవల్ల జీవితం తల్లక్రిందులైపోతుందని భయపడితే మనల్ని ముందుగా తల్లక్రిందులు చేసేది ఆ భయమే. భయమే మన దుఃఖాలన్నింటికీ మూల కారణం. భయమే మనలో దుర్మార్గాన్ని రేకెత్తించడానికి కారణం. మరి మనిషికి భయం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ఆ భగవంతుడే మనలో ఉన్నాడనీ, అటువంటప్పుడు మనం దేనికైనా సరే భయపడవలసిన అవసరం ఏమీ లేదనీ, మన అర్థం చేసుకోవడం లేదు.  మనలోని భగవంతుణ్ణే మనం ఆత్మ అని కూడా పిలుస్తాము. 


“మనిషే అందరికన్నా గొప్ప. మనిషి కన్నా గొప్పవాడు వేరే లేడు. దేవతల కన్నా కూడా మనిషే గొప్పవాడు. ఎందుకంటే మనిషి మాత్రమే తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందగలడు!” అని స్వామీజీ చెప్పారు కదా.


విశ్వమంతా, వృక్షాలు, జంతువులు, రాళ్ళూ, నీళ్ళూ, అన్నీ ఆత్మస్వరూపులే. అయితే మనిషి ఒక్కడే ఆ విషయాన్ని తెలుసుకోగలడు, అనుభూతి చెందగలడు. దాని ద్వారా తనకు మరణమే లేదనీ, తనకు ఏ బాధలూ, భయాలూ లేవనీ, తనని ఎవరూ ఏమీ చేయలేరనీ తెలుసుకోగలడు. నిజానికి మనిషి తనను తానే కష్టాలలో పడేసుకుంటాడు. 


మనిషి తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నందుకు భయపడాలి. తనను తాను అదుపుచేసుకోలేకపోతున్నందుకు భయపడాలి. భగవంతుడిమీద పూర్తి విశ్వాసం లేనందుకు భయపడాలి. తన దైనందిన జీవితంలో అవినీతితో, అన్యాయంగా ప్రవర్తించడానికి భయపడాలి. తన ప్రవర్తనలో ఎక్కడైనా మితిమీరిన స్వార్థాన్ని, మూఢనమ్మకపు భయాన్ని చూపుతున్నానేమో అని జాగ్రత్తపడాలి. అంతేకానీ ఏవో నక్షత్రాలను గురించి, తెలియని శక్తుల గురించి, రాళ్లురప్పల గురించి భయపడి ప్రయోజనం లేదు. ఒక గోడ కొంచెం అటూయిటూ జరిగినా, ఒకటో రెండో కిటికీలు ఎక్కువైనా తక్కువైనా మునిగిపోయేదేమీ లేదు. వేలికి రంగురాళ్ళు పెట్టుకుంటే జాతకం మారదు, ప్రవర్తన మారితే జాతకం మారుతుంది. 


ఎవరైతే తన మనస్సును అదుపులో పెట్టుకుని, మంచితనంతో మసలుకుంటూ, అందరితో సఖ్యంగా ఉంటూ, నలుగురికీ మేలు చేస్తూ జీవిస్తూ ఉంటాడో అటువంటి వాడికి దేవతలందరూ తోడుగానూ, రక్షణగానూ వచ్చి నిలబడతారు. అటువంటి వాడికి జీవితంలో దేనికైనా భయపడాల్సిన అవసరం ఏముంటుంది?